ఆరాధనలో మనం చేతులు ఎందుకు పైకెత్తాలి?
ఈ రోజుల్లో మనం అనేక సంఘాలకు వెళ్లినప్పుడు, ఆరాధనలోను ప్రార్థనలోను చాలామంది విశ్వాసులు తమ చేతులను పైకెత్తడం చూస్తుంటాము. అయితే మనం ఎప్పుడైనా దేవుని స్తుతించేటప్పుడు లేదా ప్రార్థించేటప్పుడు మనం చేతులను ఎందుకు పైకెత్తాలి, బైబిల్లో పైకెత్తిన చేతులు దేనిని సూచిస్తాయి అని ఆలోచించామా?
1. పైకెత్తిన చేతులు స్తుతిని వ్యక్తపరచగలవు
దావీదు తన చేతులను కేవలం ఒక ఆచారంగా పైకెత్తలేదు. దేవుని ఘనపరచాలనే తన హృదయ కోరికను వ్యక్తపరచడానికి అతడు తన చేతులను పైకెత్తాడు. కీర్తనలు 134:2; కీర్తనలు 63:4
2. పైకెత్తిన చేతులు సమర్పణను వ్యక్తపరచగలవు కీర్తనలు 143:6.
ఇక్కడ దావీదు “ప్రభువా, నా జీవితం నీ చేతుల్లోనే ఉంది. నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను.” అని తన చేతులను పైకెత్తడం ద్వారా తన ఆత్మ యొక్క సంపూర్ణ ఆధారపడటాన్ని, సమర్పణను వ్యక్తపరుస్తున్నాడు.
3. పైకెత్తిన చేతులు ఆధారపడటాన్ని మరియు దేవునికి మొరపెట్టుకోవడాన్ని వ్యక్తపరచగలవు
“ప్రభువా, నాకు సహాయం చేయి. నా బలం సరిపోవడం లేదు. నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను.” అంటూ కష్టాల్లో ఉన్నప్పుడు, సహాయం కోసం దేవునికి మొరపెట్టుకుంటూ చేతులను పైకెత్తిన సందర్భాలను బైబిల్లో చూస్తాము. (విలాపవాక్యములు 2:19; కీర్తనలు 28:2)
4. పైకెత్తిన చేతులు పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచగలవు
ఎజ్రా ప్రభువు వైపు తన చేతులను చాచి, ప్రజల పాపాలను ఒప్పుకొని ప్రార్థించాడు. తర్వాత ప్రజలు కూడా ఏడుస్తూ, తమ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డారు. (ఎజ్రా 9:5–6) (ఎజ్రా 10:1–4). అందువల్ల, చేతులు పైకెత్తడం కొన్ని సందర్భాల్లో మన హృదయంలోని విరిగిన మనస్సును, పాప ఒప్పుకోలును, పశ్చాత్తాపాన్ని కూడా వ్యక్తపరచగలదు.
5. పైకెత్తిన చేతులు విజయాన్ని సూచించగలవు
అమాలేకీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు, మోషే తన చేతులను పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు పైచేయి సాధించింది. అయితే దీని అర్థం “చేతులను పైకెత్తితే యుద్ధంలో గెలుస్తాం” అనే శారీరక సూత్రం కాదు. ఈ సంఘటన ఇశ్రాయేలు తమ స్వంత బలంపై కాకుండా దేవునిపై పూర్తిగా ఆధారపడిన విషయాన్ని చూపిస్తుంది. (నిర్గమకాండము 17:11–12)
6. పైకెత్తిన చేతులు దేవుని సన్నిధిలో ఆరాధనను వ్యక్తపరచగలవు
సొలొమోను దేవుని సన్నిధిలో నిలబడి తన చేతులను ఆకాశం వైపు చాపి ప్రార్థించాడు. సొలొమోను చేతుల స్థానం వల్ల దేవుని మహిమ ప్రత్యక్షం కాలేదు. బదులుగా, అది దేవుని సన్నిధిని గుర్తించి, ఆయన గొప్పతనాన్ని అంగీకరిస్తూ ఆరాధిస్తున్న ప్రజల హృదయ స్థితిని చూపించింది. (1 రాజులు 8:22–23; 1 రాజులు 8:10–11)
బైబిల్లో ప్రజలు ప్రార్థించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, దేవునికి మొరపెట్టుకునేటప్పుడు, తమ పాపాలను ఒప్పుకునేటప్పుడు చేతులను పైకెత్తిన సందర్భాలను చూస్తాము. కాబట్టి మనం నిజమైన హృదయంతో చేతులను పైకెత్తినప్పుడు, మన చేతులు దేవునికి ఘనతనిచ్చే ఆరాధనకు మరియు ప్రార్థనకు ఒక బాహ్యమైన వ్యక్తీకరణగా మారగలవు.
ప్రార్థనలో లేదా ఆరాధనలో చేతులు తప్పనిసరిగా పైకెత్తాల ?
మనలో చాలామందికి ఈ ప్రశ్న రావచ్చు: “ఆరాధనలో లేదా ప్రార్థనలో చేతులు పైకెత్తడం తప్పనిసరా? బైబిల్‌లో అలా చేయాలని ఆజ్ఞ ఉందా?” లేదు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేతులు పైకెత్తాలి అని బైబిల్ చెప్పదు.
- మనం చేతులను పైకెత్తవచ్చు
- మోకాళ్లపై వంగవచ్చు
- తలవంచవచ్చు
- నిశ్శబ్దంగా నిలబడవచ్చు
- పాడవచ్చు
- లేదా మన హృదయంలోనే దేవునికి ప్రార్థించవచ్చు
ఎందుకంటే నిజమైన ఆరాధన యొక్క కేంద్రం మన శరీర భంగిమ కాదు — దేవునికి మన హృదయం ఇచ్చే గౌరవం, ప్రేమ, సమర్పణ మరియు భక్తి.
ఒక చిన్న అమ్మాయి కథ చెప్తాను ...
ఒక రోజు ఒక చిన్న అమ్మాయి తన తండ్రితో కలిసి నడుస్తోంది. కొంతసేపు నడిచిన తర్వాత ఆమె అలసిపోయింది. ఆమె ఆగి, తన తండ్రి వైపు చూసి, తన రెండు చేతులను పైకెత్తింది. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె ఒక్క మాట కూడా చెప్పలేదు. తాను ఎందుకు అలసిపోయిందో వివరించలేదు. కేవలం తన చేతులను పైకెత్తింది. కాని తన చేతులు ఎత్తడం ద్వారా తన తండ్రికి అర్థం అయింది ; “నాన్నా... నన్ను ఎత్తుకో.” అని తన తండ్రి అర్థం చేసుకుంటాడని, తనను ఎత్తుకుని మోస్తాడని తను నమ్మింది , విశ్వసించింది. ఆమె తండ్రి వెంటనే ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు.
మన దేవుని దగ్గర కూడా కొన్నిసార్లు అంతే... మన పైకెత్తిన చేతులు ఎల్లప్పుడూ కృతజ్ఞతకు మాత్రమే గుర్తు కావు. కొన్నిసార్లు అవి మన హృదయంలోని ఒక మొర: “తండ్రీ, ఇక నేను దీనిని మోయలేకపోతున్నాను. నన్ను నీవే మోసుకెళ్లు.” అని చెప్పినట్లు కూడా కావచ్చు. దేవుని వైపు మన చేతులను పైకెత్తడం ఓటమిని అంగీకరించడం కాదు. అది, “నా స్వంత బలాన్ని కంటే నా తండ్రి చేతులను నేను ఎక్కువగా నమ్ముతున్నాను” అని ప్రకటించడం.
గుర్తుంచుకోండి...దేవుడు కదలాలని మనం చేతులు పైకెత్తము. దేవుడు మన హృదయాన్ని ఇప్పటికే కదిలించినందుకే మనం చేతులు పైకెత్తుతాము. మన పైకెత్తిన చేతులు మన హృదయం దేవుని వైపు ఉన్న స్థితిని బయటికి వ్యక్తపరచగలవు. కాబట్టి... మన చేతులు పైకెత్తినా, మన మోకాళ్లు వంగినా, మన తల వంచినా, లేదా నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో నిలిచినా — మన హృదయాలు మాత్రం సమస్త స్తుతికి, ఘనతకు, ఆరాధనకు అర్హుడైన దేవుని వైపే ఎల్లప్పుడూ పైకెత్తబడి ఉండాలి.
మీ కోసం ఒక బైబిల్ అధ్యయన ప్రశ్న
కష్టాల్లో ఉన్నప్పుడు చేతులు పైకెత్తిన బైబిల్ లో లెకింపబడిన వ్యక్తులను వెతకండి — విజయ సమయంలో కాదు.
ఈ విధమైన సందర్భాల్లో, ఉదాహరణకు;
- నిరాశలో
- దేవునికి మొరపెట్టుకున్నప్పుడు
- దుఃఖంలో
- దేవునిపై ఆధారపడినప్పుడు
- సంపూర్ణ సమర్పణలో
- దేవుని కోసం ఎదురుచూస్తున్నప్పుడు
మీ ఆలోచనలను మీ వ్యక్తిగత జర్నల్ / డైరీలో రాయండి లేదా కామెంట్‌లో పంచుకోండి:
“బాధలు మరియు కష్టాల మధ్య మనం చేసే ఆరాధన గురించి ఇది మనకు ఏమి నేర్పిస్తుంది?”



Comments
Post a Comment