బైబిల్ మనకు రహస్యంగా ఉంచాలని చెప్పే 5 విషయాలు
ఈరోజు ప్రపంచంలో మనుషులు తమ ఆలోచనలు, కలలు, కష్టాలు, ఆశీర్వాదాలు అన్నీ ఇతరులతో పంచుకోవడం సాధారణం అయిపోయింది. కానీ బైబిల్ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది — ప్రతి విషయం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు దాచుకోవాలి, వాటి కోసం ప్రార్థించాలి, మరియు అవి దేవునికి మనకు మధ్య మాత్రమే ఉండాలి.
ఇక్కడ మనం ఇతరులతో పంచుకోకూడని 5 ముఖ్యమైన విషయాలు చూద్దాం:
- మీ తదుపరి ప్రణాళిక లేదా దర్శనం
- దేవుడు రహస్యంగా చెప్పిన ప్రతీ విషయం
- మీ మంచి పనులు లేదా మీరు చేసిన సహాయం
- మీ బలహీనతలను గూర్చి
- మీరు పొందనున్న ఆశీర్వాదాల గురించి
1. మీ తదుపరి ప్రణాళిక లేదా దర్శనం
దేవుడు మనకు ఒక దర్శనం ఇచ్చినప్పుడు అది ప్రజలతో చర్చించడానికి కాదు; అది వ్యక్తిగతంగా సిద్దపడడానికి. బైబిల్లో యోసేపు తన కలను తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అసూయపడి అతనికి వ్యతిరేకంగా మారారు. కొన్ని సందర్భాల్లో దేవుడు మన ప్రణాళికలను దాచిపెడతాడు — శిక్షించడానికి కాదుకాని, మనలని రక్షించడానికి.
2. దేవుడు రహస్యంగా చెప్పిన ప్రతీ విషయం
మరియ యేసును గర్భంలో ధరించబోతుందని తెలిసినప్పుడు ఆమె వెంటనే అందరికీ చెప్పలేదు. లూకా 2:19 లో చెప్పబడినట్లుగా - “మరియు ఆ సంగతులన్నిటిని మరియ తన హృదయంలో దాచుకుంది.” కొన్ని ఆశీర్వాదాలు విత్తనాల్లాంటివి. వాటిని ముందుగానే బయటపెడితే అవి పెరగవు. దేవుడు నీకు చెప్పిన విషయాలను జాగ్రత్తగా కాపాడుకో.
3. మీ మంచి పనులు లేదా మీరు చేసిన సహాయం
మత్తయి 6:3–4 లో యేసు — మంచి పనులు చేస్తూ ఇతరుల ప్రశంస కోసం చేయకూడదని బోధించాడు. మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తాడు. కాబట్టి, నిశ్శబ్దంగా ఇవ్వండి, వ్యక్తిగతంగా ప్రార్థించండి—సరైన సమయంలో దేవుడు తన ప్రతిఫలం ఇస్తాడు.
4. మీ బలహీనతలను గూర్చి
యేసు ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోలేదు. ఆయనకు సన్నిహితులలో కూడా వేర్వేరు స్థాయిలు ఉన్నాయి. మీ కష్టాలను గురించి ప్రార్థించే మరియు ఆత్మీయంగా అనుభవం ఉన్న వ్యక్తులతో మాత్రమే పంచుకోండి. దేవుడు మీ బలహీనతలను పూర్తిగా శక్తితో నింపే వరకు ప్రార్థనలో ఉండండి మరియు ఆయనను నిశ్శబ్దంగా పని చేయనివ్వండి.
5.మీరు పొందనున్న ఆశీర్వాదాల గురించి
యేసు జన్మించినప్పుడు జ్ఞానులు హెరోదు రాజుకు తిరిగి వెళ్లవద్దని హెచ్చరించబడ్డారు. కొన్ని ఆశీర్వాదాలు ఇంకా పెరుగుతున్నాయి. వాటికి రక్షణ అవసరం. మీ కలలు మరియు ఆశీర్వాదాలు విలువైనవి. వాటిని కాపాడుకోండి. జాగ్రత్తగా మాట్లాడండి.
ముఖ్యమైన సత్యం గుర్తుంచుకోండి —
దేవుడు మాత్రమే మన హృదయాన్ని మరియు ఆలోచనలను పూర్తిగా తెలుసుకుంటాడు. శత్రువు మన మనసును చదవలేడు. కానీ అతను తెలుసుకోవడానికి ప్రయత్నించే కొన్ని మార్గాలు ఉన్నాయి:
- మన ప్రవర్తన ద్వారా
- మన మాటల ద్వారా
- మన పనులు/అలవాట్లను గమనించడం ద్వారా
అందుకే మన మాటల్లో జాగ్రత్త అవసరం. సామెతలు 29:11 లో చెప్పబడినట్లుగా — “మూర్ఖుడు తన భావాలన్నిటిని బయటపెడతాడు; జ్ఞానవంతుడు వాటిని అదుపులో ఉంచుకుంటాడు.”
కాబట్టి;
- ప్రతి విషయాన్ని ప్రకటించకుండా, సిద్ధపడటంపై దృష్టి పెట్టండి.
- అందరికీ వివరించకుండా — దేవుని మాటను పాటించండి.
- నిశ్శబ్దంగా ముందుకు సాగండి - హృదయపూర్వకంగా ప్రార్థించండి.
సాక్ష్యం మరియు గాయం మధ్య తేడా ఉంది. దేవుడు మనలని స్వస్థపరిచిన తర్వాత పంచుకునేది సాక్ష్యం. దేవుడు ఇంకా స్వస్థతపొందుతున్నపుడు కాపాడుకోవాల్సింది గాయం. తప్పుడు వ్యక్తులతో చాలా త్వరగా పంచుకుంటే, సహాయం కాకుండా బాధ కలగచవచ్చు.
Comments
Post a Comment