గుర్తింపులేని అమ్మాయి నిర్మించిన 3 పట్టణాలు - షెయెరా కథ
బైబిల్‌లో మనకు ఎంతో ప్రేరణనిచ్చే స్త్రీలు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు దెబోరా మరియు ఎస్తేరు వంటి స్త్రీలు దేవునిపై విశ్వాసంతో నిలబడి గొప్ప విజయాలను సాధించారు. వారు ఎదుర్కొన్న కష్టాలు, బలహీనతలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగి దేవుని కార్యంలో గొప్ప పాత్ర పోషించారు. అయితే బైబిల్‌లో మరో స్త్రీ గురించి కూడా చదువుతాము — ఆమె గురించి ఎక్కువగా మాట్లాడలేదు, ఆమె ప్రసిద్ధురాలు కాదు మరియు ఆమె పేరు కేవలం ఒక్క వచనములో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆమె చేసిన పని ఎంతో గొప్పది. ఆమె పేరు షెయెరా. ఆమె ఎఫ్రాయిము కుమార్తె. 1 దినవృత్తాంతములు 7:24 లో ఆమె మూడు పట్టణాలను నిర్మించినట్లు వ్రాయబడి ఉంది — ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును మరియు ఉజ్జెన్ షెయెరా. “షెయెరా” (She’erah) అనే పేరుకు సాధారణంగా “మిగిలిపోయినది” లేదా “వెనుకబడినది” అనే అర్థం వస్తుంది.
ఆ కాలంలో కుటుంబ గౌరవం, పేరు, వారసత్వం ఎక్కువగా కుమారుల ద్వారానే కొనసాగుతుందని భావించేవారు. అందువల్ల తండ్రులు తమ కుమారుల పేర్లను గర్వంగా చెప్పేవారు, కానీ కుమార్తెలను చాలా అరుదుగా ప్రస్తావించేవారు. చాలాసార్లు వారి కృషికి గుర్తింపు ఉండేది కాదు. 1 దినవృత్తాంతములు 7:20–29 లో ఎఫ్రాయిము వంశావళిని చదివితే అనేక మంది కుమారుల పేర్లు వరుసగా కనిపిస్తాయి. అయితే షెయెరా పేరు మాత్రం ఒక్క వచనములో మాత్రమే కనిపిస్తుంది.
దీనివల్ల ఆమెకు కుటుంబంలో ఉన్న కుమారులంతగా ప్రోత్సాహం లేదా గుర్తింపు లభించకపోయి ఉండవచ్చు అని మనం ఊహించవచ్చు. అయినప్పటికీ షెయెరా తన పరిస్థితిని కారణంగా చేసుకొని వెనుకడుగు వేయలేదు, ఆమె ఎవరో గుర్తించేవరకు ఎదురు చూడలేదు కానీ ఆమె గుర్తుంచుకునే పనిని చేసింది. బైబిల్ ప్రకారం ఆమె రెండు ముఖ్యమైన పట్టణాలను నిర్మించింది — ఉత్తరపు బేత్ హోరోనును మరియు దక్షిణపు బేత్ హోరోను. ఇవి తరువాత ఇశ్రాయేలు చరిత్రలో చాలా ముఖ్యమైన ప్రాంతాలుగా మారాయి. అదనంగా ఆమె తన పేరుతోనే ఉజ్జెన్ షెయెరా అనే మరో పట్టణాన్ని కూడా నిర్మించింది.
ఈ పట్టణాల ప్రాముఖ్యత
బైబిల్‌లోని కొన్ని వచనాల ద్వారా ఈ పట్టణాల ప్రాముఖ్యతను మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు యెహోషువ 10:10–11, 1 సమూయేలు 13:18, 2 దినవృత్తాంతములు 8:5 (మరియు 1 రాజులు 9:17) వచనాలలో ఈ ప్రాంతాల ప్రాముఖ్యతను సూచిస్తాయి.
- వ్యాపారం మరియు ప్రయాణానికి ముఖ్యమైన మార్గాల్లో ఉన్నాయి.
- యుద్ధకాలంలో రక్షణకు మరియు ప్రాంతాన్ని కాపాడటానికి ఉపయోగపడ్డాయి.
- వ్యాపారులు మరియు సైన్యాల కదలికలను నియంత్రించడానికి సహాయపడ్డాయి.
- “ఉజ్జెన్ షెయెరా” అనే పట్టణం ఆమె పేరుతో పెట్టబడింది, ఇది ఆమె చేసిన పనికి నిలిచిపోయే గుర్తుగా ఉంది.
షెయెరా కథ మనకు చెప్పే పాఠం
షెయెరా కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు గుర్తింపు పొందని వారు, ఇతరులు పట్టించుకోని వారు, ఎన్నో గొప్ప పనులు చేస్తారు. అది సంఘంలో అయినా, కుటుంబంలో అయినా, ఉద్యోగంలో అయినా, పాఠశాలల్లో లేదా కళాశాలల్లో అయినా — మనకు కనిపించని వారు దేవుని కార్యంలో గొప్ప ప్రభావాన్ని చూపవచ్చు. షెయెరా పేరు బైబిల్‌లో ఒక్క వచనములో మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆమె నిర్మించిన పట్టణాలు ఆమె కథ చుట్టూ ఉన్న నిశ్శబ్దం కంటే ఎక్కువగా మాట్లాడుతున్నాయి. కొన్నిసార్లు గొప్ప వారసత్వం మనకు ఎంత గుర్తింపు లభించిందన్నదిలో కాదు, గుర్తింపు లేకపోయినా మనం ఏమి చేసామన్నదానిలో ఉంటుంది. ప్రపంచం ఏమి చెప్పినా సరే, దేవుని దృష్టిలో మనం ఎంతో విలువైనవారం. మనలను చూస్తున్న దేవుడు మన ఆలోచనలు మరియు క్రియల ప్రకారం ప్రతిఫలమిస్తాడు..
ఒక విషయం గుర్తుంచుకుందాం:
- ఇతరులు మన విలువను గుర్తించకపోయినా దేవుడు చూస్తున్నాడు.
- మనలను ఎవరూ పైకి లేపకపోయినా మనం దేవుని సహాయంతో ఇంకా గొప్ప విషయాలు చేయగలము.
ప్రపంచం కోసం కాదు — దేవుని కోసం పని చేద్దాం. అప్పుడు మన జీవితం కూడా ఒక రోజు అనేకమందికి ఆశీర్వాదంగా మారుతుంది.
Comments
Post a Comment